మన జాతీయ జంతువు ఏది అని అడిగితే,
`పులి' ...అంటూ ఠక్కున సమాధానం వచ్చేస్తుంది.
మన జాతీయ పక్షి ఏది అంటే,
నెమలి అని కూడా చెప్పేస్తారు..
మరి మన జాతీయ లక్షణం ఏది అని అడిగితే...
ఈ ప్రశ్నకు కూడా తడుముకోకుండా ఠక్కున సమాధానం చెప్పేయవచ్చు.
మన జాతి లక్షణం అవినీతి...
దేశ జనాభాలో 60 శాతం మందిలో ప్రవహిస్తున్నది అవినీతి రక్తం.
అవినీతి ఒక శ్వాసగా మారిపోయింది...
అవినీతి ఒక ధ్యాసగా మారిపోయింది...
బ్రిటీష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన సమర యోధులున్న దేశం మనది..
ప్రజాస్వామ్యంలో బంగారు బాటలు వేసుకోవచ్చని కలలుకన్న దేశం మనది..
కానీ స్వాతంత్ర్యం వచ్చిన ఏడాదికే తొలి కుంభకోణం వెలుగుచూసింది.
దేశం ఎటు దిగజారిపోతుందో ఆనాడే తెలిసిపోయింది..
స్వేచ్ఛ చివరకు ఎవరి గుప్పెట్లో చిక్కుకుంటుందో అప్పుడే అర్థమైంది..
అప్పటి నుంచి వందలాది కుంభకోణాలు వెలుగుచూస్తూనే ఉన్నాయి..
లక్షల కోట్ల అవినీతి పేరుకుపోతూనే ఉంది...
కుంభకోణాల చిట్టా సాగిపోతోంది..
అవినీతి కోణాల సంఖ్య పెరిగిపోతూనే ఉన్నాయి.
అక్రమార్కుల అరాచకం పెట్రేగిపోతూనే ఉంది.
అవినీతి కారణంగా ఏ సంక్షేమ పథకం పూర్తి స్థాయి ఫలితాలను ఇవ్వలేకపోతున్నాయి.
పేదలు నిరుపేదలుగా మారిపోతున్నారు...
సంపన్నులు కుబేరులుగా ఎదిగిపోతున్నారు...
ఆర్థిక అసమానతలు పెరిగిపోతున్నాయి.
అంతులేని సంపద అవినీతి పరుల సొత్తుగా మారిపోతున్నది.
బాపూజీ కలలు కన్న రాజ్యం ఇదేనా..?
దేశప్రజలందరికీ స్వాతంత్ర్య ఫలాలు అందాలని జాతిపిత ఆకాంక్షిస్తే, చివరకు పరిస్థితి దానికి పూర్తి విరుద్ధంగా తయారైంది.
ఇప్పటికైనా మహాత్ముని స్మరించుకొని మనమంతా శపథం చేద్దాం.
అవినీతిని నిర్మూలించి నవ్య దేశాన్ని నిర్మిద్దాం.
అవినీతి లేని దేశంగా ఇండియాను తీర్చిదిద్దుదాం.
అందుకు ఇప్పుడే, ఈ క్షణమే మనమంతా శపథం చేద్దాం.
మౌనం వీడండి...అవినీతిని తరిమికొట్టండి..
