14, ఫిబ్రవరి 2011, సోమవారం

ప్రేమంటే ఇదేనా?

ప్రేమ ...
రెండు అక్షరాల కలయిక
రెండు హృదయాల చేరిక
ఇద్దరిని ఒక్కటిగా మారుస్తుంది      
రెండు జీవితాలను ఏకం చేస్తుంది
నిరక్షర కుక్షి కాస్త కాళిదాసులా మారిపోతాడు
కురూపి కూడా నవమన్మథుడిలా తయారవుతాడు
చెప్పుకుంటే ఈ కవిత్వం తరగదు.
చెప్పకుంటే మనసు ఊరుకోదు...

ప్రేమ  ప్రేమంటారు.
ప్రేమే జీవితమంటారు
ప్రేమ కోసం దేనినైనా కాదంటారు
ప్రేమ లేనిదే లైఫే లేదంటారు
ఆ ప్రేమ కోసం..
అర్రులు చాస్తారు
వెంటపడతారు
వేధిస్తారు
అదిరిస్తారు
బెదిరిస్తారు
అనుకున్న ప్రేమ దక్కకపోతే చంపేస్తారు.
ప్రేమంటే ఇదేనా?
ప్రేమంటే ఇంతేనా?
స్నేహం ప్రేమగా,
ప్రేమ అధికారంగా,
చివరకు పగగా మారి... ప్రాణాలను తీస్తోంది.
నేటి ప్రేమలు.. చూపులతో మొదలై,
మాటలతో పెరిగి,
అపార్థాలతో విడిపోతున్నాయి.
మనసులోని భావాన్ని మనసుతోనే గుర్తించగలిగితే అది పరిణితి చెందిన ప్రేమవుతుంది.
ఆలోచిస్తే ప్రేమకు అర్థం అనంతం. ఆలోచించలేని వారి గురించి ప్రస్తావించడం ఇక్కడ అనవసరం.
కొందరి నోళ్లలో పడి.. మరికొందరి ఆలోచనల్లో నలిగి.. అష్టవంకర్లూ తిరిగి, అపహాస్యం పాలైపోతోంది ప్రేమ.
గులాబీ రెక్కల ఎరుపుదనమే  ప్రేమికులకు కనిపిస్తుంది. ఆ రెక్కల మాటునున్న ముళ్ల కరుకుదనం పెద్దలకు తెలుస్తుంది. ఆకర్షణనే ప్రేమగా భావించి.. అభం శుభం తెలియని అమాయకుల ప్రాణాలను బలిగొంటున్నారు కొందరు నరరూపరాక్షసులు.


ప్రేమ ప్రేమ అంటారు.
ఇంతకీ ప్రేమంటే ఏంటి?
యువతీ యువకుల మధ్య ఉన్నదే ప్రేమా?
మరి తల్లిదండ్రులు, బిడ్డలు మధ్య ఉన్నదేంటి?
అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు మధ్య ప్రేమ సంగతేంటి?
ఇంట్లో పెద్దాళ్లకు, చిన్నాళ్లకు మధ్య ఉన్న బంధమేంటి?
ఎందుకు కుటుంబ ప్రేమలు కనుమరుగవుతున్నాయి?
అన్నదమ్ముల మధ్య గొడవలు, అక్కచెల్లెళ్ల మధ్య తగవులు
తండ్రీ కొడుకుల మధ్య వాగ్వాదం, తల్లికూతుళ్ల మధ్య వివాదం
అక్కకి-చెల్లెకి, అన్నకి-తమ్ముడికి, తల్లిదండ్రులకు-బిడ్డలకు ఎవరికీ పడదు. ఒకరంటే మరొకరికి గిట్టదు. ఎక్కడొస్తోంది తేడా? తెల్లారి లేస్తే... హత్యలు, అత్యాచారాలు, దోపిడీలు, దౌర్జన్యాలు.. సమాజం ఇంతలో ఎంతలా మారిపోయింది? ఒక్కమాటలో చెప్పాలంటే మానవ సంబంధాలు కనుమరుగు అయిపోతున్నాయి. మాయని మచ్చను తీసుకొస్తున్నాయి. మనిషిని మనిషిగా బతకనివ్వడం లేదు. మనశ్శాంతిగా ఉండనివ్వడం లేదు. ఇక ఇలాంటప్పుడు నిజమైన ప్రేమకు చోటెక్కడ?

12, ఫిబ్రవరి 2011, శనివారం